AP Cabinet: నవంబర్ 6వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. నవంబర్ 6 ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. శీతాకాల అసెంబ్లీ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారని సమాచారం. నవంబర్ 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏపీ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
అలాగే, రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్‌పైనా మంత్రులు ఈ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పటికే బడ్జెట్‌పై కసరత్తులు కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పాటు ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. నవంబర్ 12వ తేదన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్ర అభివృద్ధితో పాటు పలు కంపెనీలకు సంబంధించిన ఆహ్వానాల పైనా ఈ కేబినెట్ భేటీలో మంత్రులు చర్చించనున్నారు. పలు కీలక నిర్ణయాలకు మంత్రులు ఆమోదం తెలపనున్నారు.