Kerala CM: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సీఎం కాన్వాయ్ లోని పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలో సోమవారం సాయంత్రం జరిగింది. ప్రమాదంలో ముఖ్యమంత్రి సహా సిబ్బందికి ఎవరికి ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వాహనాలకు మాత్రం స్వల్ప నష్టం వాటిల్లినట్లు తెలిసింది.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం సాయంత్రం కొట్టాయం సందర్శనకు వెళ్లి తిరిగి రాజధానికి వస్తున్న సమయంలో వామనాపురం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహిళ సడెన్ గా రైట్ తీసుకోబోతుండగా.. అప్రమత్తమైన కాన్వాయ్ లోని పైలట్ వాహనం అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో వెనుక ఉన్న సీఎం కారు, అంబులెన్స్ సహా ఎస్కార్ట్ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముఖ్యమంత్రి వాహనానికి స్వల్పంగా నష్టం వాటిల్లినట్లు తెలిసింది. అదృష్టవశాత్తూ సీఎం, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.