Cheviti Venkanna: సుమారు మూడు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరిన చెవిటి వెంకన్న యాదవ్.. నేడు రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి సమక్షంలో చెవిటి వెంకన్న యాదవ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి వర్యులు, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఉన్నారు. సామాన్య కార్యకర్త నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగింది. సూర్యాపేట జిల్లాలో గుమ్మడవెల్లి గ్రామంలో సామాన్య మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన చెవిటి వెంకన్న.. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా రాజకీయ ప్రవేశం చేశారు. మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి నాయకత్వంలో అనేక రాజకీయ పదవులను నిర్వహించారు. తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా రెండు సార్లు, తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్‌గా రెండు సార్లు, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రెండు సార్లు బాధ్యతలు చేపట్టి పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు.
చెవిటి వెంకన్న నేతృత్వంలో అత్యధిక పార్టీ సభ్యత్వాలు నమోదు చేసిన జిల్లాగా సూర్యాపేట నిలిచిందంటే ఆయనకు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి అధిష్ఠానం రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడిగా పదవి ఇచ్చింది. ప్రభుత్వం ఉన్నా, లేకున్నా ప్రజల సమస్యలపై పోరాటం చేసిన గొప్ప నాయకుడు చెవిటి వెంకన్న యాదవ్. ఆయన తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకోవడంలో ముందున్నారు. ఈ ప్రయాణంలో అవినీతికి తావు లేకుండా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారు. అవకాశాల కోసం పార్టీలు మారుతూ, జెండాలు మారుస్తున్న ఈ రోజుల్లో ఏదేమైనా తన జీవితం పార్టీకి అంకితం చేసిన నాయకుడు చెవిటి వెంకన్న యాదవ్. ఇతర పార్టీల నుంచి ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీ మారకుండా కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేశాడు. రాష్ట్ర మంత్రులతో పాటు ముఖ్యమంత్రి వద్ద కూడా చెవిటి వెంకన్న మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో పాటు సూర్యాపేట జిల్లాలో బీసీ నాయకుల్లో మంచి పేరున్న నాయకుడిగా చెవిటి వెంకన్న యాదవ్ నిలిచారు. పార్టీ కోసం అహర్నిశలు పాటుపడిన నాయకుడు రైతు కమిషన్ మెంబర్‌గా రావడంతో రైతులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. తాను స్వయంగా వ్యవసాయం చేస్తూ రైతుగా తనకున్న అనుభవంతో అన్నదాతలకు మేలు జరిగేలా చేస్తారని రైతాంగం భావిస్తోంది.