MLA Mandula Samuel: మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఒక చిచోరగాడు అని.. కిషోర్ తన స్థాయిని మించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కిషోర్ కి లేదన్నారు. గాదరి కిషోర్ బతుకెంత… స్థాయెంత అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మరోసారి ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుక కోస్తా అంటూ హెచ్చరించారు. గాదరి కిషోర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన మాట్లాడే అర్హత గాదరి కిషోర్ కు ఉందా అంటూ ప్రశ్నించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎమ్మెల్యే గా గెలిచినప్పుడు కిషోర్ వయసు ఎంత అంటూ ప్రశ్నలు గుప్పించారు. కోమటిరెడ్డి తలుచుకుంటే గాదరి కిషోర్ నల్గొండలో అడుగుపెట్టగలడా అంటూ వ్యాఖ్యానించారు.
గాదరి కిషోర్ కథలన్నీ బయటకు తీస్తే జైలుకు పోవడం ఖాయమన్నారు. గాదరి కిషోర్ కు ఇచ్చిన డాక్టరేట్ పైన విచారణ జరపాలన్నారు. అక్రమ ఇసుక దందా లో గాదరి కిషోర్ కు డాక్టరేట్ ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. నయీంతో కలిసి కిషోర్ చేసిన భూ దందాల పైన విచారణ జరగాలన్నారు. ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన ఆగదన్నారు. మూసీపైన మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్, హరీష్ రావుకు లేదన్నారు. ధర్నా చౌక్‌లు ఎత్తివేసిన వారు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే మందుల సామేలు మండిపడ్డారు.