Perni Nani: జగన్ కుటుంబ విషయాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై అత్యాచారాలు జరిగితే ప్రభుత్వం పట్టించుకోదని.. కానీ తల్లి, చెల్లిపై జగన్ కేసు వేసాడనీ ఇది భూమి బద్దలయ్యే విషయంగా టీడీపీ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జగన్‌పై విషం చిమ్మేలా ఈ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ మరణానికి ముందే జగన్, షర్మిలకు ఆస్తులు కేటాయింపు జరిగిందన్నారు. తర్వాత జగన్ వ్యాపారాల్లో వచ్చిన డబ్బుతో అనేక పెట్టుబడులు స్వార్జితంతో ఏర్పాటు చేశారని తెలిపారు. సరస్వతి పవర్ కూడా జగన్ స్వార్థితంతో ఏర్పాటు చేశారన్నారు. చెల్లికి ప్రేమగా బాధ్యతతో ఇవ్వాలని జగన్ ఆస్తులు ఇచ్చారన్నారు. చంద్రబాబు ఎవరికైనా ఆస్తులు ఇచ్చారా.. చంద్రబాబు ఏ రోజైన చెల్లికి, తమ్ముడికి ఆస్తి చిల్లి గవ్వ ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. కోర్టు కేసులు అన్నీ అయ్యాక మాత్రమే ఆస్తులు వెళ్లేలా ఎంవోయూ రాసుకున్నారన్నారు.
భారతి సిమెంట్స్ 40 శాతం వాటా ఇస్తానని షర్మిలకు రాశారని చెప్పారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌లో కూడా విజయమ్మకు జగన్ షేర్లు ఇచ్చారన్నారు. ఆస్తులపై తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిందని వెల్లడించారు. టీడీపీ దగుల్బాజీ పార్టీ అని విమర్శలు గుప్పించిన పేర్ని నాని.. ఆ పార్టీతో జగన్ రాజకీయాలు చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. జగన్ ఇంట్లో ఆస్తుల గొడవ అయితే మీకేంటి సంబరమంటూ వ్యాఖ్యానించారు. ఇదేమన్నా రాష్ట్ర సమస్యా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎందుకు ఈ పులకరింత అంటూ ఎద్దేవా చేశారు. 2019లో MOU చేస్తే 2024లో ఇదంతా చేస్తున్నారు ఎందుకంటూ ప్రశ్నలు గుప్పించారు.
చంద్రబాబు డైరెక్షన్ లో ఇదంతా చేస్తున్నారన్నారు. జగన్ బెయిల్ రద్దు చేయటం కోసం చేస్తున్న కుట్ర అని ఆయన పేర్కొన్నారు. కోర్టు స్టేటస్ కో ఇచ్చినా షేర్లు బదిలీ చేయటం, కంపెనీ బోర్డు డైరెక్టర్లను మార్చటం వంటివీ చేస్తే బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంటుందనే ఇదంతా చేయిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే , మంత్రి అయ్యాక కూడా పిల్లను ఇవ్వక పోతే ఎన్టీఆర్ తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తే వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. శత్రువులతో కలిసి తనను తిరిగి జైలుకు పంపుతారనీ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. విజయమ్మ ఇదంతా చేశారని చెప్పలేమన్నారు. షర్మిల అంతా చేసేస్తున్నారు కదా అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో నిత్యం షర్మిల మాట్లాడుతున్నారని తెలిపారు. జగన్ ఓడిపోయారు అధికారంలో లేకపోయినా.. జగన్ మీద విమర్శలు తప్ప టీడీపీ మీద షర్మిల విమర్శలు చేయటం లేదన్నారు. తెలంగాణలో అధికార పార్టీని షర్మిల తూర్పార పట్టి ఇక్కడ సైలెంట్‌గా ఉంటోంది అంటే అర్థం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు దగుల్బాజీ కుట్రలకు బలై పోవటానికి జగన్ ఏమీ ఎన్టీఆర్ కాదన్నారు.