Home » Bomb Threat: విమానాలుకు బూటకపు బాంబు బెదిరింపులు.. కేంద్రం కీలక నిర్ణయం

Bomb Threat: విమానాలుకు బూటకపు బాంబు బెదిరింపులు.. కేంద్రం కీలక నిర్ణయం

Bomb Threat: విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి కేసుల్లో ప్రమేయం ఉన్న నిందితులను నో ఫ్లై లిస్టులో పెట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం ప్రకటించారు. ఇందుకోసం విమానయాన భద్రతా నియమాలలో కూడా మార్పులు చేయవచ్చు. గత వారంలో భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 100 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. 1982 సివిల్ ఏవియేషన్‌ చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర మంత్రి చెప్పారు. విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయనే అంశంపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) హోం మంత్రిత్వ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు.ఈ బెదిరింపుల వెనుక ఏదైనా కుట్ర ఉందా అని అడిగినప్పుడు, విచారణ కొనసాగుతోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ‘ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉంది’ అని ఆయన అన్నారు. ఇప్పటివరకు వచ్చిన కాల్స్‌ అన్ని బూటకమని తేలిందన్నారు.

ఇటీవల పలు విమానాలకు బెదిరింపులు
ఆదివారం ఒక్కరోజే ఇండిగో, ఆకాశ ఎయిర్, విస్తారాకు చెందిన 20కి పైగా విమానాలు బాంబు బెదిరింపు బారిన పడటం గమనార్హం. దీంతో బీసీఏఎస్ అధికారులు, ఎయిర్ లైన్ సీఈవోల మధ్య సమావేశం జరిగింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ ఆర్ఎస్ భట్టి, బీసీఎఎస్ డైరెక్టర్ జనరల్ జుల్ఫికర్ హసన్ సోమవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఫేక్ కాల్స్ పెరిగిపోవడంపై చర్చ జరిగింది. హోం మంత్రిత్వ శాఖలో జరిగిన అరగంట సమావేశంలో, డైరెక్టర్ జనరల్స్ ఇద్దరూ ఇటీవల వచ్చిన నకిలీ బాంబు బెదిరింపుల గురించి హోం కార్యదర్శికి తెలియజేశారు. ఈ బెదిరింపులు దేశవ్యాప్తంగా భయాందోళనలకు కారణమయ్యాయి. భారత విమానయాన అధికారులు, నిఘా సంస్థలు మరియు ఇతర విభాగాలచే విస్తృతమైన భద్రతా తనిఖీలకు దారితీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *