Cheviti Venkanna: రైతు కమిషన్ సభ్యులుగా ఏడుగురిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, న్యాయవాది సునీల్, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, గంగాధర్, కె.వి. నర్సింహారెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్, మరికంటి భవానీని సభ్యులుగా ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రైతు కమిషన్ ఛైర్మన్‌గా కోదండ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. వీరు రెండేళ్ల పాటు పదవిలో ఉండనున్నారు.
సూర్యాపేట జిల్లాలో కీలక కాంగ్రెస్ నేతగా ఉన్న చెవిటి వెంకన్న యాదవ్‌కు రైతు కమిషన్ సభ్యుడిగా పదవిని కేటాయించడంతో ఆయన అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పార్టీని నిలబెట్టిన వ్యక్తికి ఈ చిన్న పదవి కట్టబెట్టడం ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు చెవిటి వెంకన్న యాదవ్ కూడా ఈ పదవిని నిరాకరించేందుకు సిద్ధమయ్యారని సమాచారం. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఉందని తెలిసింది. ఇప్పటికే ఆయన సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పగ్గాలు మోస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన భువనగిరి నుంచి ఎంపీ సీటును ఆశించినా.. సీఎం రేవంత్‌కు సన్నిహితుడైన చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి కేటాయించారు. ఎంపీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం చెవిటి వెంకన్న పని చేశారు. ఇటీవల ఆయనకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తారని ఊహాగానాలు వినిపించాయి. ఆ లిస్ట్‌లో కూడా వెంకన్న పేరు లేకపోవడంతో అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. చివరకు రైతు కమిషన్ సభ్యుడిగా చిన్న పదవి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని వెంకన్న అభిమానులు, జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోగితున్నారు. రేపు నిరసనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.