CEC Rajiv Kumar: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సీఈసీ రాజీవ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లోని ఫిథోర్ ఘర్ లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన హెలికాప్టర్ ఫిథోర్ ఘర్ లోని రాలంలో ల్యాండ్ చేయబడింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ హెలికాప్టర్ మిలాం వైపు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ విజయ్ కుమార్ జోగ్దాండే కూడా ఆయన వెంట ఉన్నారు. ఇద్దరు అధికారులతో పాటు పైలట్ క్షేమంగా ఉన్నారని, ఎలాంటి గాయాలు కాలేదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్ 15న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈవీఎంలకు సంబంధించిన ప్రశ్నలకు కూడా సమాధానమిచ్చారు. హర్యానా ఎన్నికల్లో ఈవీఎంలపై వచ్చిన ఫిర్యాదులపై స్పందిస్తానని చెప్పారు. ప్రతి ఫిర్యాదుకు సరైన సమాధానం లిఖితపూర్వకంగా ఇవ్వబడుతుంది. ఈవీఎంలను ఒకసారి కాదు చాలాసార్లు తనిఖీ చేస్తారని వెల్లడించారు.
దేశ 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్
రాజీవ్ కుమార్ దేశ 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన సెప్టెంబర్ 1, 2020 నుండి ఎన్నికల కమిషనర్‌గా ఎన్నికల కమిషన్‌లో ఉన్నారు. ఆయన 15 మే 2022న ప్రధాన ఎన్నికల కమిషనర్ బాధ్యతలు స్వీకరించారు. 18 ఫిబ్రవరి 2025 వరకు పదవిలో కొనసాగుతారు. రాజీవ్ కుమార్ తన 65వ పుట్టినరోజును 19 ఫిబ్రవరి 2025న జరుపుకోనున్నారు. రాజ్యాంగం ప్రకారం, ఎన్నికల కమిషనర్ పదవీకాలం ఆరు సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయస్సు వరకు ఉంటుంది.
రాజీవ్ కుమార్ 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు చెందిన 1984 బ్యాచ్ అధికారి రాజీవ్ కుమార్.. తన సుదీర్ఘ పరిపాలనా జీవితంలో అనేక ముఖ్యమైన బాధ్యతలను నిర్వహించారు. ఆయన కేంద్రంలో, బీహార్/జార్ఖండ్ రాష్ట్ర కేడర్‌లో వివిధ మంత్రిత్వ శాఖలలో పనిచేశాడు. B.Sc., L.L.B., PGDM, M.A. పబ్లిక్ పాలసీలలో అకడమిక్ డిగ్రీలు పొందిన రాజీవ్ కుమార్, సామాజిక రంగం, పర్యావరణం, అడవులు, మానవ వనరులు, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాలలో విస్తృతమైన పని అనుభవం కూడా కలిగి ఉన్నారు.