ప్యాంగ్యాంగ్ : దక్షిణ కొరియాను నాశనం చేస్తానని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ సోదరి బెదిరించారు. మానవరహిత డ్రోన్‌లు మళ్లీ ఉత్తర కొరియాకు చేరుకుంటే సియోల్ “భయంకరమైన విపత్తు”ను ఎదుర్కొంటుందని ఉత్తర కొరియా నియంత సోదరి శనివారం హెచ్చరించింది.
దీనికి ఒక రోజు ముందు, దక్షిణ కొరియా అలాంటి డ్రోన్‌లను ప్రారంభించిందని ఆరోపించారు. అక్టోబర్ 3న ప్యోంగ్యాంగ్ గగనతలంలోకి ప్రచార కరపత్రాలను మోసుకెళ్లే డ్రోన్‌లను దక్షిణ కొరియా పంపిందని, మళ్లీ ఈ వారం కూడా దక్షిణ కొరియా పంపిందని ఉత్తర కొరియా శుక్రవారం తెలిపింది.
దక్షిణ కొరియా రక్షణ మంత్రి కిమ్ యోంగ్-హ్యూన్ మొదట ఈ వాదనను ఖండించారు, అయితే దక్షిణ కొరియా యొక్క జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తరువాత ఒక ప్రకటనలో ‘ఉత్తర కొరియా ఆరోపణలు నిజమో కాదో నిర్ధారించలేము’ అని అన్నారు. ఆరోపణలను ధృవీకరించడానికి సియోల్ నిరాకరించడం వల్ల డ్రోన్‌లను మిలటరీ గ్యాంగ్‌స్టర్లు పంపారని అర్థమవుతోందని కిమ్ జోంగ్ ఉన్ సోదరి తెలిపారు.
శనివారం అర్ధరాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో డ్రోన్ మళ్లీ ఉత్తర కొరియా రాజధానిపై కనిపిస్తే అది ఖచ్చితంగా భయంకరమైన విధ్వంసంను సృష్టిస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనను అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా తీవ్రమైన సైనిక దాడిగా KCNA అభివర్ణించింది.
దక్షిణ కొరియా ప్రతినిధులు చాలా కాలంగా కిమ్ వ్యతిరేక ప్రచార కరపత్రాలు, ఇతర వస్తువులతో కూడిన బెలూన్‌లను విడుదల చేస్తున్నారు. ఇందులో K-పాప్, దక్షిణ కొరియా టీవీ సీరియల్‌లను కలిగి ఉన్న USB స్టిక్‌లు వంటి అంశాలు ఉన్నాయియ వీటిని ఉత్తర కొరియా వ్యతిరేకించింది. నియంత కిమ్ జోంగ్ ఉన్ దక్షిణ కొరియా సంస్కృతి, పాప్ సంస్కృతిని చెడ్డవిగా భావించి, అది తన ప్రజలకు చేరకుండా నిరోధిస్తున్నాడు.