Home » Minister Gottipaati Ravi Kumar: సాగర్ ఆయకట్టులో ప్రతి ఎకరాకు నీరందిస్తాం..

Minister Gottipaati Ravi Kumar: సాగర్ ఆయకట్టులో ప్రతి ఎకరాకు నీరందిస్తాం..

Minister Gottipaati Ravi Kumar: సాగర్ ఆయకట్టులో ప్రతి ఎకరాకు సాగునీరందించి రైతులకు మేలు చేకూర్చుతామని విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ ఐదేళ్ల నిర్లక్ష్యం కారణంగా కాలువలు మరమ్మతులకు నోచుకోలేదని, ఫలితంగా నీళ్లు వృధా అయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంతమాగలూరు మండలం, అడవిపాలెం గ్రామం నుంచి 35 కి.మీ. మేర ప్రవహిస్తూ, దాదాపు లక్షా 80 వేల ఎకరాలకు నీళ్లు అందించే అద్దంకి బ్రాంచ్ కెనాల్ రవికుమార్ ఆదివారం పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ….కాలువల గుండా నీళ్లు వృధా అవ్వకుండా చిల్లకంప, శిల్డ్‌ను క్లీన్ చేయించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. షట్టర్ల మరమ్మతులు చేసి, లేని చోట కొత్తవి ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైతే 5 మండలాల్లో 5 మెషిన్లు ఏర్పాటు చేసి వేగవంతంగా మరమ్మతులు చేయాలని కాలువ పరివాహక ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ త్వరితగతిన చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. పర్చూరుకు కూడా సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలో 18వ మైలు రాయి నుంచి ప్రవహించే అద్దంకి బ్రాంచ్ కెనాల్‌లో గుండా 1,200 క్యూసెక్కుల నీరు పారించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.


పేర్ల మార్పు తప్ప…పనుల్లో పురోగతి లేదు
గత ప్రభుత్వం కొలుసుపాడు ప్రాజెక్టుకు పొలిరెడ్డి ప్రాజెక్టుగా పేరు మార్చుకున్నారు తప్ప పనుల్లో పురోగతి లేదన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఒక రిజర్వాయర్‌కు భూసేకరణ పూర్తి చేశామని, రెండో రిజర్వాయర్‌కు కాలువ పనులు పూర్తి చేశామన్నారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల పెండింగ్‌‌లో ఉన్న భూసేకరణ, నిర్వాసిత సమస్యలన్నీ పరిష్కరిస్తామని, కొలుసుపాడు, తూర్పుపాలెం నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి వచ్చే ఏడాదిలోపు కొలుసుపాడు రిజర్వాయర్‌ను నీళ్లతో నింపుతామని స్పష్టం చేశారు. ఆగిపోయిన భవనాసీ రిజర్వాయర్ పనులను రీఎస్టిమేట్ చేసి పనులు పునఃప్రారంభిస్తామన్నారు. గత ప్రభుత్వంలో గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయి వేలాది క్యూసెక్కుల నీరు వృధా అయిందని, కనీసం మరమ్మతులు చేయించలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టు స్థితిగతులపై దృష్టి పెట్టి 10 గేట్లు ఏర్పాటు చేసామని, మరో 2 గేట్లు కూడా త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. గుండ్లకమ్మ రిజర్వాయర్‌ను పూర్తిస్థాయిలో నీళ్లతో నింపి 90 వేల ఎకరాలకు నీళ్లు అందించడమే తమ లక్ష్యమన్నారు. సాగర్ ఆయకట్టు ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లు అందించి అద్దంకి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమన్నారు.

One thought on “Minister Gottipaati Ravi Kumar: సాగర్ ఆయకట్టులో ప్రతి ఎకరాకు నీరందిస్తాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *