TG DSC 2024: తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. డీఎస్సీ అభ్యర్థులకు అక్టోబర్ 9న నియామక పత్రాలు అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎల్బీస్టేడియంలో 9వ తేదీన సాయంత్రం 4 గంటలకు 11 వేల 63 టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని సీఎం తెలిపారు. ఆదివారం సాయంత్రం ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్తగా నియమితులైన 1635 మందికి శిల్పారామంలో ఉద్యోగ నియామక పత్రాలను ముఖ్యమంత్రి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగులే ఆయువు పట్టు అంటూ చెప్పుకొచ్చారు. సమస్యలన్నీ పరిష్కరించి నియామక పత్రాలు అందజేస్తున్నామని సీఎం తెలిపారు.
రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎంతో కాలం ఉద్యోగాల కోసం ఎదురుచూసి ప్రభుత్వాలపై విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. నిరుద్యోగం వల్ల నేడు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిందని సీఎం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు సీఎ రేవంత్. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తున్నామన్నారు. వందలాది మంది విద్యార్థుల బలిదానాలే ఈనాడు తెలంగాణ అంటూ చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.