Home » IND vs BAN: తొలి టీ20లో బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం

IND vs BAN: తొలి టీ20లో బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం

IND vs BAN: గ్వాలియర్ 12 సంవత్సరాల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు స్వాగతం పలికింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు గ్వాలియర్ ప్రజలను నిరాశపరచలేదు. తొలుత బౌలర్లు బంగ్లాదేశ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగా.. ఆ తర్వాత భారత బ్యాట్స్‌మెన్ ఫోర్లు, సిక్సర్ల మోత మోగించారు. కొత్తగా నిర్మించిన శ్రీమంత్ మాధవరావ్ సింధియా స్టేడియంలో బంగ్లాదేశ్‌ను పసికూనలా ఓడించిన భారత్.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లో రెండో మ్యాచ్ అక్టోబర్ 9న ఢిల్లీలో జరగనుంది.


టాస్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేశారు. అరంగేట్రం చేసిన యువ పేస్‌ బౌలర్ మయాంక్ యాదవ్ కూడా ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్ టైగర్స్ 19.5 ఓవర్లలో కేవలం 127 పరుగులకే ఆలౌటైంది. అనంతరం భారత బ్యాటర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేశారు. 49 బంతుల్లోనే తొలి మూడు వికెట్లు కోల్పోయి 11.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించారు. పాండ్యా, నితీష్‌లు నాలుగో వికెట్‌కు 24 బంతుల్లో 52 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చారు.


హార్దిక్ పాండ్యా విన్నింగ్ షాట్‌తో ముగిసిన మ్యాచ్
ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్యా ఈరోజు భిన్నమైన స్వాగ్‌లో కనిపించాడు. పాండ్యా 16 బంతుల్లో అజేయంగా 39 పరుగులు చేసి విన్నింగ్ షాట్ తో మ్యాచ్ ను ముగించాడు. 12వ ఓవర్ తొలి మూడు, నాలుగు, ఐదో బంతుల్లో పాండ్యా బ్యాటింగ్ చేసిన తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పాండ్యా నో లుక్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి ముందు పాండ్యా కూడా నాలుగు ఓవర్లలో 26 పరుగులిచ్చి ఒక వికెట్ తీయడంతో పాటు రెండు క్యాచ్‌లు అందుకున్నాడు.


సత్తా చాటిన భారత బ్యాట్స్‌మెన్‌
ఈ మ్యాచ్‌లో ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్‌లు ఔటయ్యారు. అయితే వారు క్రీజులో ఉండేందుకు కాదని, షాట్లు కొట్టేందుకు వచ్చారని అందరూ చెప్పారు. సంజూ శాంసన్ 19 బంతుల్లో 29 పరుగులు చేశాడు. ఏడు బంతుల్లో 16 పరుగులు చేసి అభిషేక్ శర్మ ఔటయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 14 బంతుల్లో 29 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. అరంగేట్రం ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి 15 బంతుల్లో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో 39 పరుగులతో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా నిలిచాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *