Home » Chilli Cultivation: మిరప సాగు చేసే విధానం

Chilli Cultivation: మిరప సాగు చేసే విధానం

Chilli Cultivation: మిరప పంటను రైతులు ఎర్రబంగారంగా పిలుస్తారు. మిరప పంట సాగులో సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ సాగుచేస్తే ఆశించిన స్థాయిలో మంచి దిగుబడులు పొంది మంచి ఆదాయాన్ని పొందొచ్చు. మిరప పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే తెగులు నిరోధక ఆరోగ్యకరమైన నారును ప్రధానంగా పొలంలో నాటుకోవాలి. మొక్కల మధ్య మొక్కల వరుసల మధ్య అధిక దూరం ఉంటే మొక్కలకు సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగిలి మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి. మొక్కల మధ్య దూరం ఉంటే ఏవైనా తెగుళ్లు లేదా చీడపీడలు ఆశిస్తే వ్యాప్తి తక్కువగా ఉంటుంది. మిరప పంటలో కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే, పంటను దాదాపుగా సంరక్షించుకున్నట్టేనని నిపుణులు చెబుతున్నారు. ప్రధాన పొలంలో మిరప నారు నాటడానికి రెండు రోజుల ముందు ఒక లీటరు నీటిలో 1.5 మిల్లీలీటర్ల పెండిమిథలిన్ ను నేల పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి. మొక్కలు నాటిన 25 రోజులకు గుంటకతో అంతర కృషి చేయాలి. ఈ పంటలో కొన్ని మెళకువలు పాటిస్తే సంపద కూడా అంతే స్థాయిలో ఉంటుంది.

ఎలాంటి నేలలు అనువైనవి..
మిర్చి పంటకు ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు చాలా అనువుగా ఉండడంతో పాటు అధిక దిగుబడి వస్తుంది. పంట సాగు భూమిలో పోషకాల శాతాన్ని పెంచుకోవడానికి ముందుగా పచ్చిరొట్ట లేదా మినుము పంటను వేసుకొని భూమిలో కలియదున్నాలి. దీనివల్ల భూమికి సహజ పోషకాలు లభిస్తాయి. 10-15 రోజుల తరువాత ట్రాక్టర్ కల్టివేటర్ తో నేల మెత్తగా దుక్కి అయ్యేవరకు 2-3 సార్లు దున్నుకోవాలి. నేలపై నారును పెంచడానికి కొంచెం ఎత్తులో మట్టిని బెడ్లుగా తయారు చేసుకోవాలి. నాలుగు మూలాలు ఒకే ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. నారుమడిలో విత్తనాల మధ్య దూరం ఒక అంగుళం(ఇంచు) ఉండాలి. సేల్టర్‌లో నారు వెయ్యనివారు నారు మొక్కలకి ఎక్కువ ఎండ తగలకుండా నీడ కోసం జాలి పరదా లేదా వస్త్రాన్ని టెంటులగా పైన వేసుకోవాలి. మొక్క వయస్సు 35 నుంచి 40 రోజుల మధ్యలో మొక్కలను నేలల్లో నాటుకోవడానికి సిద్ధం చేసుకోవాలి.

మొక్కలు ఇలా నాటుకోండి..
మొక్కలను నాటుకునేటప్పుడు మొక్కల మధ్య దూరం 24 x 24 అంగుళాలు (ఇంచులు), లేదా 26 x 26 అంగుళాలు, లేదా 28 x 28 అంగుళాల దూరం నేల స్వభావాన్ని బట్టి దురాన్ని ఎంచుకొని రెండువైపులా అచ్చులుగా దునుకోవాలి. ఇలా రెండువైపులా అచ్చులుగా దున్నుకుని నాటు వేయడం వల్ల మొక్కల మధ్య సమానం దూరం ఉండడంతో పాటు కలుపును నివారించేందుకు.. అంటే కలుపు నాగలికి అనువుగా ఉండడం వల్ల కూలీల వినియోగం తగ్గుతుంది. అలాగే మొక్కల ఎదుగుదలకు కూడా బాగా ఉంటుంది. మొక్కలు పెట్టడానికి తీసిన రంధ్రాలలో కొద్దిగా నీరు పోసి వేర్లు మడత పడకుండా జాగ్రత్తగా నాటుకోవాలి. డ్రిప్ పద్ధతిలో మొక్కలు నాటినట్లయితే.. మొక్కల మధ్య దూరం 30 నుంచి 45 సెంమీ దూరం ఉండేలా చూసుకోవాలి.

కలుపు యాజమాన్యం
మిరప సాళ్ల మధ్య, సాళ్లలో మొక్కల మధ్య దూరం ఉండేలా చూసుకోవాలి. అలా ఉంటే గుంటకలతో సేద్యం చేయటానికి అవకాశం ఉంటుంది. గుంటకతో సాళ్ల మధ్య ఉన్న కలుపును దున్నివేయవచ్చు. దీంతో కలుపు చాలా వరకు భూమిలో కలిసిపోతుంది. మిరప నాటిన 20-25 రోజులకు మొదలు పెట్టి, ఆ తరువాత ప్రతి 15-20 రోజులకు ఒకసారి చొప్పున సాళ్ళ మధ్యన ఖాళీ కలిసిపోయేంత వరకు వరకు అంతర సేద్యం చేయాలి. నాటువేసిన తోటలలో సాళ్ళ మధ్యన, మొక్కల మధ్యన దూరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అంతర సేద్యం రెండువైపుల చేయవచ్చు. అంతర సేద్యం చేసిన తరువాత పొలంలో మిగిలిపోయిన కలుపు మొక్కలు కూలీలతో తీయించాలి. కలుపు నివారణకు రసాయనాలు మొక్కలను నాటుకునే 1-2 రోజుల ముందు పెండిమిథాలిన్ 1.5 మిల్లీలీటర్లకు ఒక లీటర్ చొప్పున నీటిని కలుపుకొని పిచికారి చేసుకోవాలి. పంటలో కలుపుమొక్కలు ఉన్నట్లయితే మొక్కలు నాటిన 25 రోజుల తరువాత క్వైజాలోఫాస్ ఇథైల్ ఎకరానికి 400-500 మిల్లీలీటర్లు మొక్కలపై పడకుండా జాగ్రతగా పిచికారి చెయ్యాలి. డ్రిప్ ద్వారా పంటకు సాగు చేసినప్పుడు ప్లాస్టిక్ మల్చింగ్ వినియోగించడం వల్ల కలుపును నివారించవచ్చు. ఈ మందులు వాడినపుడు మిరప పైరు 4-5 రోజులు కొంచెం పసుపు రంగుకు మారి ఎదుగుదల తగ్గుతుంది. 7-10 రోజులకు సాధారణ స్థితికి వస్తుంది. కాబట్టి వర్షాలు ముసురుగా కురుస్తూ అంతర సేద్యానికి అవకాశం లేనపుడు మాత్రమే ఈ మందులు వాడాలి. మిరవ పెరిగే దశలో ఆశించే వెడల్పాకు కలుపు మొక్కల నివారణకు విచికారి చేసే కలుపు మందులు ప్రస్తుతం ఏమి అందుబాటులో లేవు.

మిరపలో దఫదఫాలుగా నీరు కట్టవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి, నీరు కట్టిన ప్రతీసారి కూడా కలుపు మొలిచే అవకాశం ఉంటుంది. పైరులో సాళ్లు కమ్ముకున్న తరువాత కలుపు వల్ల పెద్దగా సమస్య లేనప్పటికీ, పాయలాకువంటి కలుపు ఆశించినపుడు పైరు నీడలో కూడ పెరుగుతూ నష్టం కలుగజేన్తుంది. అటువంటి పరిస్థితులలో బాగా పెరిగిన మిరప పైరులో నీరుకట్టి నేల బాగా తడిగా ఉన్నపుడు ఆక్సిఫ్లూరో ఫెన్‌ 23.5% ఎకరానికి 200 మి.లీ. కలుపు మందు 10 కిలోలు ఇసుకలో కలువుకుని మిరప మొక్కల పైన పడకుండ సాళ్ల మధ్యలో నేలమీద పడేటట్లు చల్లినపుడు పాయలాకు కలుపును నివారించవచ్చు. ఈ మందు మిరప మొక్కలమీద పడితే ఆకులు మాడిపోయే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించాలి.

పంటకు పోషకాలను ఇలా అందించండి..
మొక్కలను నాటిన 20-25 రోజులలోపు ఎకరానికి నత్రజని 120 కిలోలు, భాస్వరం 24 కిలోలు, పొటాష్ 48 కిలోలు కలుపుకొని పంటకు వేసుకోవాలి. మొక్క పెరుగుదలను బట్టి నత్రజని ఎరువులను అందించాలి. పూత, కాయ నాణ్యత కోసం పొటాష్ ను 2 నుంచి 3సార్లు అందిచాంలి. వర్షాలు ఎక్కువగా పడుతున్నపుడు మొక్కలు నేల నుండి పోషకాలను తీసుకోలేవు కాబట్టి 13.0.45 లేదా 19.19.19 ఎరువును 8 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని పైపాటుగా పిచికారి చేసుకోవాలి.

తెగుళ్ల నివారణ
మన తెలుగు రాష్ట్రాల్లో అధిక లాభాలను అందిస్తున్న పంట కావడంతో ఈ పంటను పండించడానికి రైతులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే ఈ పంటకు వాతావరణం బట్టి తెగుళ్లు కూడా ఎక్కువగానే సోకుతాయి.. సరైన సమయంలో చర్యలు తీసుకుంటే అధిక లాభాలను పొందవచ్చు.. ఎటువంటి తెగుళ్లు ఆశిస్తాయి.. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

పొగాకు లద్దె పురుగు
మిర్చి పంట దిగుబడి తగ్గడానికి పొగాకు లద్దె పురుగు ముఖ్య కారణం. ఈ పురుగు సాయత్రం, రాత్రి సమయాల్లో మొక్క యొక్క ఆకులను ఆహారంగా తీసుకుంటుంది. కావున నివారణ కోసం రసాయన మందులను సాయంత్రా సమయాల్లో పిచికారి చేయడం మంచిది. నోవాల్యూరాన్ 10% 1 మీ.లీ / 1 లీటర్ నీటికి లేదా లూఫేన్యురాన్ 5.4% EC 1.25 మి.లీ / 1 లీటర్ నీటికి లేదా థాయోడికార్బ్ 75% WP 1.5 గ్రాము / 1 లీటర్ నీటికి కలుపుకొని 20-25 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయడ ద్వారా పొగాకు లద్దెపురుగు పూర్తిగా నివారించవచ్చు. ఇలాంటి పద్ధతులు పాటించి మిర్చి పంటను సాగు చేస్తే మంచి లాభాలు వాస్తు, పంట దిగుబడి కూడా మంచిగా ఉంటుంది.

కాయ కుళ్లు తెగులు..
చలి వాతావరణంలో కొమ్మ ఎండుకాయ కుళ్లు తెగులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. తెగులు కారణంగా ముదురు కొమ్మల బెరుడుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కొమ్మల పై నుంచి కిందికి ఎండిపోతాయి. పండుకాయల మీద నల్లని మచ్చలు ఏర్పడడం అవి సహజ రంగును కోల్పోయి వరిగడ్డి తెలుపు రంగులో కనిపిస్తాయి. అందుకే దీనిని మజ్జిక తెగులు అంటారు. దీని నివారణకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 200 మి.లీ ప్రాపికొనజోల్‌, అజాక్సిస్ట్రోబిన్‌ లేదా 100 మి.లీటర్ల డైఫెన్‌కొనజోల్‌ లేదా 600 గ్రాముల ఫైరాకొలస్ట్రోబిన్‌-మిటిరం లేదా 400 గ్రాముల ప్రోపినెబ్‌ కలిపి పిచికారి చేసుకోవాలి

నారు కుళ్ళు తెగులు..
చిన్న మొక్కల కాండం మెత్తబడి గుంపులు గుంపులుగా నారు చనిపోతుంది. మొలకెత్తిన వెంటనే ఒకసారి మరలా వారం రోజులకు ఒకసారి మూడు గ్రాముల కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.. అప్పుడే కుళ్ళు తెగులు తగ్గుతుంది..

చిగురు కుళ్ళు తెగులు..
ఇది తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నారుమళ్ళు, సాలు తోటల్లోనూ ఆశించి మొవ్వు లేదా చిగురు భాగం ఎండిపోతుంది. కాండం పై నల్లని నిర్దిష్ట ఆకారం లేని మచ్చలు ఏర్పడి క్రమేణా చారలుగా మారుతాయి.. ఆకులు ఎండిపోతాయి.. ఈ తెగులు చాలా ప్రమాదం పంటకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి..

తెల్ల నల్లి..
తెల్లనల్లి పురుగులు ఆకుల రసాన్ని పీల్చడం వలన ఆకులు కిందికి ముడుచుకొని తిరగబడిన పడవ ఆకారంలో కనపడతాయి. ఆకుల కాడలు సాగి ముదురు ఆకుపచ్చగా మారుతాయి.. దీని నివారణ కోసం పంటకు ఒక లీటరు డైనోఫాల్‌ను కొట్టడం మంచిది..

తామర పురుగులు..
రెక్కల పురుగులు ఆకుల అడుగుభాగాన చేరి రసాన్ని పీల్చడం వలన ఆకుల అంచులు పైకి ముడుచుకుంటాయి. ఆకులు, పిందెలు రాగి రంగులోకి మారి పూత, పిందె నిలిచిపోతుంది. దీని నివారణకు ఎకరానికి 300 గ్రాములు ఎసిఫేట్‌ లేదా 400 మిల్లీ లీటర్లు ఫిప్రోనిల్‌ లేదా స్పైనోశాడ్‌ 75 మిల్లీ లీటర్లు ఆకులు అడుగుభాగం తడిచేలా పిచికారీ చేయాలి..

పేను బంక..
పేనుబంక లేత కొమ్మలు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల పెరుగుదల తగ్గిపోతుంది. తీయ్యటి పదార్థాన్ని విసర్జించటం వలన చీమల్ని ఆకర్షిస్తుంది. ఆకులు, కాయలు నల్లటి మసిపూసినట్లుగా మారిపోతాయి. నివారణకు ఎకరానికి మిథైల్‌డెమటాన్‌ 400 మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్‌ 300 గ్రాములు చేయాలి. పిల్ల పురుగులు, మొగ్గలు, పూత, పిందెలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.. సరైన సమయంలో దీన్ని కనిపెట్టి నివారణ చర్యలు చేపట్టాలి లేకుంటే తీవ్ర నష్టమే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *