Groundnut Farming: వేరుశనగ ప్రపంచంలోని ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాలలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ వేరుశనగ ద్వారా నూనెతో మనం ఎన్నో రకాలుగా వినియోగిస్తుంటాం. ఈ విత్తనం నూనె శాతం 44-50% ఉంటుందని అంచనా. పంటలో ఉపయోగకరమైన భాగం నేల కింద కాయలుగా పెరుగుతుంది. వేరుశెనగ ప్రధాన ఉపయోగాలు సబ్బు తయారీ, సౌందర్య సాధనాలు, కందెన పరిశ్రమలు మొదలైన వాటిలో కనిపిస్తాయి. వేరుశెనగ కేక్‌ను కృత్రిమ ఫైబర్ తయారీకి ఉపయోగిస్తారు. వేరుశెనగ పంటల యొక్క ఆకుపచ్చ లేదా ఎండిన ఆకులను హాల్మ్స్ అని పిలుస్తారు. పశువుల దాణాగా ఉపయోగిస్తారు. అసలు ఈ వేరుశనగ పంట సాగు విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పంటకోసం ఇలాంటి నేలలను ఎంచుకోవాలి..
వేరుశనగ కోసం ఇసుక శాతం ఎక్కువ ఉండి తేమ శాతం తక్కువగా ఉండే నేలల్లో పంట బాగా పండుతుంది. ఈ వేరుశనగ పంటకు నల్లరేగడి నేలలు ఏ మాత్రం పనికిరావు. నేల యొక్క పీహెచ్ 6.0 నుండి 6.5 ఉండేలా చూసుకోవాలి. మన తెలుగు ప్రాంతాలలో వర్షపాతం 50 నుండి 125 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అవుతుంది కాబట్టి ఈ వాతావరణం మనకు చాలా అనువైనది అని చెప్పుకోవచ్చు. వేరుశనగ పంట వేసే ముందు భూసార పరీక్ష చేయించుకుంటే అందుకు అనుగుణంగా ఎరువులను వాడుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
తెగుళ్ల నివారణకు చర్యలు
వేరుశనగ పంటకు అనేక రకాల పురుగులు, తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యమైనవి వేరు పురుగు, ఆకు ముడత పురుగు, పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు, తామర పురుగు, పచ్చ దీపపు పురుగు, మొగ్గ తొలుచు పురుగు, తాక్కా ఆకుమచ్చ తెగులు, మొదలు కుళ్లు తెగులు, వేరుకుళ్లు తెగులు, కాండం కుళ్లు తెగులు, మొవ్వ కుళ్లు తెగులు, కుంకుమ తెగులు ఎక్కువగా పంటకు ఆశిస్తాయి. తెగులు లక్షణాలను ఎప్పటికప్పుడు వ్యవసాయాధికారులకు చెప్పినట్లయితే అందుకు తగిన సస్యరక్షణ చర్యలను వివరిస్తారు. అవసరమైతే వ్యవసాయ అధికారులచే క్షేత్ర పర్యటన చేయించడం ద్వారా సస్యరక్షణ చర్యలను తెలుసుకునే అవకాశం ఉంది.
విత్తన రకాలు… వచ్చే దిగుబడులు
విత్తన రకాలను బట్టి పంట దిగుబడులు వస్తాయి. మంచి విత్తనం వేసుకుంటే అధిక దిగుబడిని పొందొచ్చు కదిరి-6విత్తన రకంతో యాసంగిలో ఎకరాకు 12 నుంచి 14క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కదిరి-9 విత్తనం సాగు చేస్తే ఎకరాకు 10-12క్వింటాళ్లు, కదిరి హరితాంధ్ర ద్వారా 10-12క్వింటాళ్లు, ధరణి ద్వారా 9-10 క్వింటాళ్లు, టీఏజీ-24ద్వారా 8నుంచి 10క్వింటాళ్లు, జేఎల్-24ద్వారా 10నుంచి 11క్వింటాళ్లు, ఐసీజీవీ-91114 ద్వారా 10-12క్వింటాళ్లు, కదిరి-7,8 ద్వారా 12-14క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఇటీవల కొత్తగా వచ్చిన కదిరి లేపాక్షి-1812 రకం విత్తనంతో ఎకరానికి 15-18క్వింటాళ్ల దిగుబడి కూడా వస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో నాలుగు సీజన్లలో వేరుశనగ పంటను విత్తుతారు. ఖరీఫ్ సీజన్లో 65 శాతం వర్షాధార పరిస్థితులను బట్టి విత్తుతారు. రబీ సీజన్లో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల చాలా పరిమితంగా సాగు చేస్తారు. వేరుశనగ పంటకి ఉష్ణోగ్రత 15 ºC కంటే తక్కువ ఉండకూడదు. వేసవిలో వేరుశనగ పంటని ఈ కాలంలో పండిస్తునప్పుడు నీటిపారుదల 11 నుంచి 14 సార్లు ఉండేలా చూసుకోవాలి.
ఈ వేరుశనగ పంట కోసం దుక్కి దున్నేటప్పుడు తక్కువ లోతులో దున్నుకోవాలి.. ఎందుకంటే ఎక్కువ లోతులో దున్నితే పంట కోసటప్పుడు కష్టతరంగా మారుతుంది. అలాగే మొక్క ఎక్కువగా పెరిగి కాయలు భూమి లోతులో కాస్తాయి. కావున 10 నుంచి 16 సెంటీమీటర్ల వరకు దున్నితే సరిపోతుంది.
ఇలాంటి విత్తనాలనే ఎంచుకోవాలి..
మేలు రకం వితనాన్ని ఎంచుకునే విధానంలో మొదటగా వేరుశనగ గింజ పై పొర (తోలు) దెబ్బతిన్న ఉన్న, గింజ రంగు మారిన విత్తనాలను పూర్తిగా తొలగించాలి. విత్తనం పైపొర తొలగిపోతే ఆ గింజ మొలకెత్తదు. విత్తన వ్యాధులు, తెగుళ్ల నివారణ కోసం వేరుశనగ విత్తనాలను తీరం (3 గ్రా / కేజీ విత్తనాలు), మాంకోజెబ్ (3 గ్రా / కేజీ విత్తనాలు) లేదా కార్బెండజిం (2 గ్రా / కేజీ విత్తనాలు) విత్తనాలకు కలిపి విత్తుకోవాలి. విత్తనం విత్తుకున్న అనంతరం ఎలుకలు, ఉడతలు, పక్షులు చెలక వైపుకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విత్తనం విత్తుకునేప్పుడు మన దేశవాళి నాగలితో విత్తనం లోతు 5 సెం.మీ. మించకుండా చూసుకోవాలి. సాలుల మధ్య దూరం 30-45 సెం.మీ. ఉండేలా చూసుకోవాలి.
నీటి పారుదల విధానం
వేరుశనగ వర్షాకాలం మొదలు కాకముందే ఎక్కువ వేస్తారు కాబట్టి మొదట 1నుంచి 2 సార్లు నీటి పారుదల అవసరమవుతుంది. ఒకవేళ ఆ సమయంలో వర్షాలు పడితే నీటిపారుదల అవసరం ఉండకపోవచ్చు. వేరుశనగ మొక్కలు పుష్పించే సమయంలో నీటిపారుదల చాలా అవసరం. 8 నుంచి 10 రోజులకు ఒకసారి నీటి పారుదల చేపట్టాల్సి ఉంటుంది. అదేవేసవిలో అయితే 5 నుంచి 8 రోజులకు ఒక్కసారి అయినా నీరు అందించాల్సి ఉంటుంది.ఎందుకంటే ఎండల ప్రభావంతో చేను అదిరిపోయే ప్రమాదం ఉంటుంది.
కలుపు తీత
చేనులో కలుపు ఎక్కువైతే పంట ఎదుగుదల కష్టతరంగా మారుతుంది. ఈ కలుపు మొక్కల వల్ల పంట దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంది. కావున పంట సమయంలో 28 రోజుల నుంచి 42 రోజుల మధ్య కలుపు తీత చేపట్టాలి. 60 రోజుల వరకు పంటలో కలుపు మొక్కలను పూర్తిగా తొలగించాలి. అయితే వేరుశనగ కాయలు ఏర్పడే సమయంలో మొక్కల వేరు భాగంలో మట్టి కదలకుండా జాగ్రత్తపడాలి. అందుకే ఆ సమయానికి ముందే కలుపు తీసేయాలి.
చీడపీడలు, తెగుళ్ల నివారణ
వేరుశనగపంటను అధికంగా తెగుళ్లు ఆశిస్తాయి. ఈ తెగుళ్ల కారణంగా పంట దిగుబడి తగ్గిపోతుంది. వేరు పురుగు, ఆకు ముడత పురుగు, పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు, తామర పురుగు, పచ్చ దీపపు పురుగు, మొగ్గ తొలుచు పురుగు, తాక్కా ఆకుమచ్చ తెగులు, మొదలు కుళ్లు తెగులు, వేరుకుళ్లు తెగులు, కాండం కుళ్లు తెగులు, మొవ్వ కుళ్లు తెగులు, కుంకుమ తెగులు ఎక్కువగా పంటకు ఆశిస్తాయి. ఈ సమయంలో 10 లీటర్ల నీటిలో 30 ml ఫాస్ఫామిడాన్ లేదా 10 లీటర్ల నీటిలో 30 ml డైమెథోయేట్ లేదా 10 లీటర్ల నీటిలో 25 ml మిథైల్-ఓ-డెమెటన్ లను కలుపుకొని 10 రోజుల వ్యవధిలో రెడుసార్లు పిచికారీ చెయ్యడం ద్వారా తెగుళ్లను సమర్థవంతంగా నియంత్రించి అధిక దిగుబడులను సాధించవచ్చు.