Union Cabinet Key Decisions, Every one Over 70 to be Covered under Ayshman Bharat
Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ కింద వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల నాలుగున్నర కోట్ల కుటుంబాలకు, 6 కోట్ల సీనియర్ సిటిజెన్లకు లబ్ధి చేకూరేలా కేంద్రం నిర్ణయించింది. ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పథకంగా నిలవనుంది. ప్రధానమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మానవతా దృష్టిలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని కేంద్ర కేబినెట్ నిర్ణయాలను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే వేర్వేరు పథకాల్లో రిజిస్టర్ అయి ఉన్న వృద్ధులు సైతం ఆయుష్మాన్ భారత్‌లో లబ్ధి పొందొచ్చన్నారు.
హైడ్రో పవర్ కోసం 12,471 కోట్ల రూపాయలను కేటాయించారు. దేశంలో 31,359 మెగావాట్ల పవర్ టార్గెట్‌గా ఈ నిర్ణయం తీసుకున్నారు. పీఎం-ఈ డ్రైవ్ కోసం 10,900 కోట్ల రూపాయలను కేటాయించేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్ వెహికల్స్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. టూవీలర్లు, త్రీ వీలర్లు అంబులెన్స్‌లు, ట్రక్కుల కోసం 88,500 ప్రదేశాల్లో చార్జింగ్ పాయింట్ల ఏర్పాటు కోసం నిర్ణయించారు. పీఎం-ఈ బస్, పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం కోసం 3,435 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కోసం రూ.70,125 కోట్లను కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాలు, రిమోట్ ఏరియాల్లో రోడ్ల నిర్మాణం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. మిషన్ మోసమ్ ( వాతావరణం) కోసం 2,000 కోట్ల రూపాయల కేటాయించారు. వాతావరణ శాఖకు మరింత టెక్నాలజీ అందించడం, నెక్స్ట్ జనరేషన్ రాడార్స్ శాటిలైట్లను ఉపయోగించడం, హై పర్ఫామెన్స్ కంప్యూటర్ల వినియోగం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.