Home » Fee Reimbursement: ఫీజు రీయింబర్స్ మెంట్ ఇంకెన్నడు?

Fee Reimbursement: ఫీజు రీయింబర్స్ మెంట్ ఇంకెన్నడు?

Fee Reimbursement: తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల బకాయిలా కొండలా పేరుకుపోయాయి. వేల కోట్ల బకాయిలు ఉండడంతో అటు విద్యార్థులతో పాటు కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇచ్చేందుకు కాలేజీ యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. దీంతో ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కావడంతో పాటు తమ జీవితంలో విలువైన సమయాన్ని వృథా చేసుకోవాల్సి వస్తోంది. ఇంటర్‌, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతోపాటు, వృత్తి విద్యాకోర్సులను అభ్యసించే నిరుపేద ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకారవేతనాలను ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన నిధుల విడుదల పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.


ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్ లను వాయిదాల పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో 25 శాతం, మధ్యలో 50 శాతం, చివరలో మిగతా 25 శాతం చెల్లించాలి. కానీ ఈ ప్రభుత్వం ఆ విధానాన్ని పాటిస్తున్నట్లు కనిపించడం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల నిధులు వేల కోట్లలో ప్రభుత్వం బకాయి పడింది. సర్కారు ఈ నిధులను విడుదల చేయకపోవడంతో లక్షల మంది మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఫీజు చెల్లించని కారణంగా యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలల యాజమాన్యాలు డబ్బు కడితే కానీ సర్టిఫికేట్లు ఇవ్వమని ఖరాకండిగా చెప్పేస్తున్నాయి. స్థోమత లేని విద్యార్థులు చేసేదేమీ లేక చదువులను మధ్యలోన ఆపేస్తున్నారు. మరోవైపు రీయింబర్స్మెంట్ చెల్లించకుంటే కాలేజీలు నడిపిదెలా అంటూ ప్రశ్నిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఎంత మంది విజ్ఞప్తి చేసినా సర్కారు స్పందించడం లేదు. నిధులు విడుదల చేయకపోవడంతో నిరుపేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *