Deepika Padukone: బాలీవుడ్ బెస్ట్ కపుల్స్‌లో దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ జంట ఒకటి. ఇప్పుడు ఈ జంట తల్లిదండ్రులయ్యారు. ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం దీపిక పదుకొనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. ఈ శుభవార్తతో దీపికా, రణవీర్ కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరిశాయి. ఈ జంటకు అభిమానులు, నెటిజనులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఫిబ్రవరిలో దీపిక గర్భం దాల్చినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన రామ్ లీలా చిత్రం సమయంలో దీపికా-రణ్వీర్ ప్రేమలో పడ్డారు. ఈ జంట 2018లో ఇటలీలోని లేక్ కోమోలో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అనంతరం వారు బెంగళూరు, ముంబైలలో గ్రాండ్ రిసెప్షన్‌లను నిర్వహించారు. కొన్ని రోజుల క్రితం ఈ జంట ప్రెగ్నెన్సీ షూట్ కూడా చేసింది. ఈ చిత్రాలలో దీపిక తన బేబీ బంప్ చూపిస్తూ ఉంటుంది. ఇక సినిమాల విషయానికొస్తే రణవీర్ గతేడాది ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం సింగమ్ ఎగైన్ చిత్రం కోసం పనిచేస్తున్నారు. దీపిక ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.