USA 4B movement: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడం ఆ దేశంలో మహిళల ఆగ్రహానికి కారణమైంది. యూఎస్‌లో ట్రంప్ విజయం సాధించడం ఆ దేశంలోని లక్షలాది మహిళలకు నచ్చడం లేదు. డెమోక్రాట్ పార్టీ గెలుస్తుందని అంతా భావించినప్పటికీ ట్రంప్ విజయంతో అమెరికాలో మహిళల కలలు చెరిగిపోయాయి. అబార్షన్‌లు, ఇతర హక్కుల విషయంలో ట్రంప్ వైఖరిని మహిళలు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. అయితే ట్రంప్ విజయానికి పురుషులు ఓట్లు వేయడమే కారణమని అక్కడి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురుషులపై కోపంతో వారితో పెళ్లి, డేటింగ్, శృంగారం, పిల్లలు వంటి బంధాలకు దూరంగా ఉండాలని 4B ఉద్యమంలో మహిళలు చేరారు. అమెరికా ఎన్నికల సమయంలోనే కమలా హారిస్ ప్రచారంలో ట్రంప్‌ను స్త్రీవాద వ్యతిరేక శక్తిగా అభివర్ణించింది. అయితే ట్రంప్ గెలవడంతో మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు. వీటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో చాలా మంది మహిళావాదులు ఈ ‘‘4B మూమెంట్’’లో చేరారు. ఇప్పుడు ఇది అమెరికాలో ట్రెండ్ అవుతోంది. పురుషులతో సంబంధాలు పెట్టుకోవద్దని ఒక వర్గానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున నినదిస్తున్నారు.
4B మూమెంట్ అంటే ఏంటంటే.. 4B అనేది ‘‘ 4 నోస్’’ అని అర్థం వస్తుంది. కొరియన్‌లో ‘‘Bi’’ అంటే ‘‘వద్దు’’ అనే అర్థం వస్తుంది. 2018లో సౌత్ కొరియాలో మొదలైంది. అక్కడి రాడికల్ ఫెమినిస్టులు ఈ ఉద్యమాన్ని సోషల్ మీడియా ద్వారా విస్తృతం చేశారు. ఇది పురుషులతో ‘‘వివాహం,సెక్స్, బిడ్డల్ని కనడం, డేటింగ్’’ వంటివి వద్దు అనే నాలుగు విషయాలకు ప్రాధాన్యత ఇచ్చాయి.